కేంద్ర బడ్జెట్ పై మంత్రి వేముల మండిపాటు

 

హైదరాబాద్:

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతులను,పేదలను దగా చేసి అదానీ,అంబానీలను ఆదుకునే బడ్జెట్లా ఉన్నదని రాష్ట్ర రోడ్లు భవనాలు,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇది రైతులను,పేదలను పూర్తిగా వంచించే బడ్జెట్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధిహామీ పథకానికి గత బడ్జెట్ కంటే 30వేల కోట్లు తగ్గించి పథకాన్ని నిర్వీర్యం చేయాలనుకోవడం సిగ్గు చేటన్నారు. మోడీ ప్రభుత్వ చివరి బడ్జెట్ లో కూడా పసుపుబోర్డు కు మొండిచేయి చూపారన్నారు. నిజామాబాద్ ఎంపి ఎన్నికల హామీని నెరవేర్చక పసుపు రైతులను వంచనకు గురి చేశాడని మండిపడ్డారు. కర్ణాటక అప్పర్ భద్రకు జాతీయహోదా ఇచ్చి ప్రత్యేక నిధులు కేటాయించారు సరే…తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం,పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టులు ఎందుకు మరిచారని ప్రశ్నించారు. ఇంత పెద్ద సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో రూపాయి కేటాయించక పోవడం ముమ్మాటికీ తెలంగాణపై బీజేపీ కేంద్ర ప్రభుత్వ వివక్షే అన్నారు. తెలంగాణ జాతీయ రహదారులకు ఇప్పటి వరకు లక్ష 25 వేల కోట్ల బడ్జెట్ కేటాయించిన కేంద్రం ఈ ఎనిమిది ఏళ్లలో ఖర్చు చేసింది కేవలం 18వేల కోట్లే అని తెలిపారు. తెలంగాణకు జాతీయ రహదారులు భారీగా ఇచ్చాం అని గొప్పలకు పోతున్న వారు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. జాతీయ రహదారుల కోసం కేటాయించిన బడ్జెట్ ఈ లెక్కన చూస్తే ఎన్ని సంవత్సరాలకు ఖర్చు చేస్తారని ప్రశ్నించారు. బడ్జెట్ లో తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ లేదు, నర్సింగ్ కాలేజీ లేదు,నవోదయ స్కూల్స్ ఊసే లేదు,రైల్వే లైన్లు లేవు అన్నింటా తెలంగాణపై బీజేపీ మోడీ ప్రభుత్వం వివక్ష ప్రదర్శించిందని మండిపడ్డారు. మోదీ అండ్ కో బ్యాచ్ తెలంగాణకు వచ్చి ప్రసంగాల్లో పెద్ద పెద్ద మాటలు చెప్పడం తప్పా..చేతల్లో చూపించింది శూన్యం అన్నారు. ఈ బడ్జెట్ కేటాయింపులతో తెలంగాణ పై కేంద్ర ప్రభుత్వ వివక్ష వైఖరి మరోసారి తేటతెల్లం అయ్యిందన్నారు. ఇకనైనా తెలంగాణ బీజేపీ నేతలు జబ్బలు చరుచుకోడం మానేసి కేటాయింపుల్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest