రంగారెడ్డి:
బీజేపీ నిరుద్యోగ మార్చ్‌పై రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిరుద్యోగ మార్చ్ చేయాల్సింది తెలంగాణలో కాదు.ఢిల్లీలో మోదీ ఇంటి ముందు చేయాలని రాష్ట్ర బీజేపీ నేతలకి కేటీఆర్ సూచించారు. ప్రతిపక్షాల మాటలను నమ్మొద్దని యువత, నిరుద్యోగులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
బీజేపీ నేతలు నిరుద్యోగుల కోసం ధర్నాలు చేస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో మోదీ.. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిండు. ఆ మాట ప్రకారం ఈ 9 ఏండ్లలో 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. సిగ్గు లేకుండా ధర్నా చేస్తున్నా.. బీజేపీ నాయకుల్లారా.. కనీసం 18 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండా.. నిరుద్యోగ మార్చ్.. ఇక్కడ కాదు.. ఢిల్లీలోని నరేంద్ర మోదీ ఇంటి ముందు చేయాలి అని కేటీఆర్ సూచించారు.
ఇది హుషారైన తెలంగాణ.. మీ చిల్లర మాటలకు పడిపోదు..
రైతుల ఆదాయం డబుల్ చేస్తనని చెప్పాడు. కానీ రైతుల కష్టాలు డబుల్ అయ్యాయి. నల్లధనం ఎక్కడ అని అడిగితే తెల్లముఖం వేస్తున్నాడు. దేశంలో ఎవరైనా అసమర్థత ప్రధాని ఉన్నారంటే.. అతను మోదీనే. మీ నరేంద్ర మోదీ ప్రభుత్వంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా లేవా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వం రంగ సంస్థలు అమ్ముతూ.. లక్షల ఉద్యోగాలకు పాతర వేస్తలేరా..? అని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు గండి కొడుతూ.. మా తమ్ముళ్ల నోట్లో మట్టి కొడుతూ.. మీరు నిరుద్యోగ మార్చ్ చేస్తే నమ్మేందుకు ఈ తెలంగాణ ఎడ్డి తెలంగాణ, గుడ్డి తెలంగాణ అని అనుకుంటున్నారా..? ఇది హుషారైన తెలంగాణ.. కేసీఆర్ నాయకత్వంలో నడుస్తున్న తెలంగాణ. మీ చిల్లర మల్లర మాటలకు పడిపోయే తెలంగాణ కాదు. ఎవరు ఏందో మాకు తెలుసు అని కేటీఆర్ తెలిపారు.
బాధ్యులను విడిచిపెట్టే ప్రసక్తే లేదు..
మీ కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి ప్రభుత్వ కొలువుల్లో 95 శాతం రిజర్వేషన్లు స్థానికులకు తీసుకొచ్చిన కేసీఆర్ మాకు అండగా ఉన్నాడని కేటీఆర్ పేర్కొన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పేపర్ లీకేజీ అయింది వాస్తవమే. వెంటనే ఆయా పరీక్షలను రద్దు చేశాం. జరిగిన నష్టానికి బాధ్యులైన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. టీఎస్‌పీఎస్సి తో విద్యాశాఖకు, ఐటీ శాఖకు సంబంధం ఉండనే ఉండదు. అదొక ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్ధ సంస్థ. కేవలం నిధులు, కార్యదర్శిరూపంలోనే ప్రభుత్వం సహకారం ఉంటుంది. ఇంత ఇంగితజ్ఞానం లేని వారు మన ప్రతిపక్షంలో ఉండటమనేది దురదృష్టకరం అని కేటీఆర్ విమర్శించారు.
తమ్ముళ్లకు, చెల్లెళ్లకు విజ్ఞప్తి చేస్తున్నా.. వారి ఉచ్చులో చిక్కుకోకండి..
రాష్ట్ర వ్యాప్తంగా ఉండే తమ్ముళ్లకు, చెల్లెళ్లకు విజ్ఞప్తి చేస్తున్నా.. వాళ్లందరి కంటే ముఖ్యమంత్రికి, మాకు మీపై ప్రేమ ఉన్నది కాబట్టే తప్పులు జరగొద్దన్న ఉద్దేశంతో పరీక్షలను రద్దు చేశాం అని కేటీఆర్ స్పష్టం చేశారు. కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు. జరిగిన లోటుపాట్లను సవరించుకుని బ్రహ్మాండంగా ముందుకు పోతాం. జరిగిన నష్టానికి అందరం చింతిస్తున్నాం. దయచేసి ఈ చిల్లరగాళ్లు పన్నిన ఉచ్చులో చిక్కుకోకండి. వాళ్ల కుట్ర మాకు తెలుసు. ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చిన నాడే ఇదే బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. నోటిఫికేషన్లు ఇచ్చి యువతను మాకు దగ్గర కాకుండా కుట్ర చేస్తున్నారని మాట్లాడారు. అందుకే మొత్తం ఉద్యోగ నియామకాలకే పాతర వేసే కుట్ర జరుగుతుంది. ఉద్యోగ నియామక ప్రక్రియను ఆపే కుట్ర జరుగుతుంది. యువతను, నిరుద్యోగులను రెచ్చగొట్టే కుట్ర జరుగుతుంది.. దానికి లోను కాకండి అని కేటీఆర్ సూచించారు.