హైదరాబాద్ , మార్చి 29:
నాణ్యమైన ఆహారం ప్రపంచానికి అందించడం మనందరి బాధ్యత అని తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రపంచానికి అన్నం పెట్టే వ్యవసాయరంగం ఎంతో గొప్పది.ప్రపంచ ఆకలితీర్చే సత్తా భారత్ కు ఉంది.పురుగుమందుల వాడకంపై నియంత్రణ ఉండాలి.హానికరమైన కీటకాలను నియంత్రించేటప్పుడు పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా చూడాలి. ఈ విషయంలో పరిశోధకులు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు పరిశ్రమలు ప్రత్యేక దృష్టిపెట్టాలి అని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ ట్రైడెంట్ హోటల్ లో ‘వ్యవసాయరంగంలో ఉత్పాదకతను పెంచడంలో రసాయనాల పాత్ర మరియు సుస్థిర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు’ అంశంపై క్రాప్ లైఫ్ (పురుగుమందుల కంపెనీల ఉమ్మడి సంఘం) నిర్వహించిన సదస్సులో మంత్రి మాట్లాడారు.
పురుగుమందుల వాడకంపై రైతులకు మరింత అవగాహన కల్పించి చైతన్యపర్చాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నది .. కంపెనీలు కూడా రైతులకు నిరంతరం శిక్షణనివ్వాలి. వ్యవసాయంలో రసాయనాల వాడకంతో పంట ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. ప్రతి ఒక్కరూ శాస్త్రజ్ఞుల పరిజ్ఞానాన్ని, సైన్సును అర్దం చేసుకోవాలి. పురుగుమందుల వాడకంలో రైతులు మోసపోకుండా చట్టపరమైన నియంత్రణకు పరిశ్రమలు ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి. రసాయనాల వాడకం, వ్యవసాయ యాంత్రీకరణలో ఊబరైజేషన్ దిశగా ప్రాధాన్యం ఇచ్చి శాస్త్రవేత్తలు దృష్టిపెట్టాలి .. ఈ విషయంలో నేను పలుమార్లు విజ్ఞప్తి చేశాను
వ్యవసాయరంగానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలి . సాగునీరు, విద్యుత్, నేల యొక్క ఆరోగ్యం, పంటల వైవిధ్యీకరణ, పంటల నాణ్యత, పంటల మార్కెటింగ్ పై దృష్టిపెట్టాలి. తెలంగాణ రాష్ట్రంలో వీటిపై దృష్టిసారించి లక్ష్యానికి చేరువయింది.వరి ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానంలో నిలిచాం. వ్యవసాయరంగ అభివృద్ధి చెందాలంటే విభిన్న పంటల సాగును ప్రోత్సాహించాలి .. దానిలో భాగంగా తెలంగాణలో పంటల వైవిధ్యీకణపై ప్రత్యేక దృష్టి పెట్టాం.పరిశ్రమలు వ్యాపార దృక్పధంతో పాటు సామాజిక బాధ్యతను నెరవేర్చాలి .. వనపర్తి జిల్లా కేంద్రంలో వే సైడ్ మార్కెట్ నిర్మించిన సింజెంట కృషి అభినందనీయం. వినూత్న ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో దేశంలోనే తొలిసారి మహిళా డిగ్రీ వ్యవసాయ గురుకుల కళాశాల ఏర్పాటుచేశాం అని మంత్రి చెప్పారు. క్రాప్ లైఫ్ ఇండియా చైర్మన్ డాక్టర్ కేసీ రవి , క్రాప్ లైఫ్ ఇండియా వైస్ చైర్మన్ శ్రీనివాస్ కారవడి, ఏపీఎంఎ ఆంధ్ర – తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షులు నారాయణరెడ్డి తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
