ప్రీతిని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి

  • నిమ్స్ లో చికిత్స పొందుతున్న బాధిత పీజీ వైద్య విద్యార్థిని పరామర్శించిన మంత్రి
  • కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పిన మంత్రి
  • ప్రీతి కి మెరుగైన వైద్య0 అందించాలని వైద్యులకు ఆదేశాలు
  • వరంగల్ CP తో మాట్లాడి, ఘటనపై ఆరా!
  • సున్నితమైన ఈ అంశాన్ని రాజకీయం చేయడం పై ఆవేదన

హైదారాబాద్,  ఫిబ్రవరి 24:
పీజీ వైద్య విద్యార్థి వేధింపులకు తాళలేక ఆత్మ హత్యాయత్నానికి పాల్పడి, హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతున్న పాలకుర్తి నియోజకవర్గం మొండ్రాయి గ్రామం గిర్ని తండా కు చెందిన పీజీ విద్యార్థిని ప్రీతి ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఈ రోజు పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగయిన వైద్యం అందించాలని ఆదేశించారు. మరో వైపు వరంగల్ సీపీ రంగ నాథ్ తో మాట్లాడి ఈ ఘటన పై తాజా పరిస్థితి ని తెలుసుకున్నారు. ఇంకోవైపు ప్రీతి తల్లి దండ్రులు, కుటుంబ సభ్యులను ఓదార్చారు. వ్యక్తిగతంగా తను, ప్రభుత్వం అండగా ఉందని ధైర్యం చెప్పారు. ప్రీతి కి మంచి వైద్యం అందిస్తున్నాం అన్నారు. అలాగే ప్రీతి తల్లి దండ్రులు శారద, (రైల్వే లో ఏ ఎస్ ఐ) దరావత్ నరేందర్ నాయక్ లతో, వైద్యులను కలిపి ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రీతి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి పై అవగాహన కల్పించేందుకు కృషి చేశారు. కుటుంబ సభ్యులకు వున్న సందేహాలను నిమ్స్ డైరెక్టర్, సూపరింటెండెంట్, ఇతర వైద్యులతో మాట్లాడించి నివృత్తి చేశారు. జరిగిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియా తో మాట్లాడుతూ… ఈ ఘటన అత్యంత బాధా కరం. ఇలాంటి ఘటనలను ఖండించాలి. ప్రీతి కుటుంబం నా పాలకుర్తి నియోజవర్గం కు చెందినది. చాలా కాలంగా ఆ కుటుంబంతో అనుబంధం ఉంది. సంప్రదాయ పద్ధతిలో ఉండే ఫ్యామిలీ. ప్రీతి నిప్పులాంటి అమ్మాయి. ఆమె ను వేధించిన వ్యక్తి కి సోషల్ మీడియా ద్వారా గట్టిగా కౌంటర్ ఇచ్చి తిప్పి కొట్టింది. వేధింపుల వల్లే మానసిక వేదనకు గురైనట్లు గా అనిపిస్తున్నది. పోలీస్ విచారణ జరుగుతున్నది. దోషులు తేలితే, ఎంతటి వారినైనా వదిలి పెట్టేది లేదు. చట్ట ప్రకారం కచ్చితంగా శిక్షిస్తం. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అని మంత్రి చెప్పారు.

ఇక కొందరు అతి సున్నితమైన ఈ అంశాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. లబ్ధి పొందాలని చూస్తున్నారు. అలాంటి వారి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఇలాంటి సందర్భాల్లో బాధిత కుటుంబానికి అండగా నిలవాలి. ప్రీతి బతకాలి. న్యాయం జరగాలి. దోషులకు శిక్ష పడాలి. అని బాధిత కుటుంబం కోరుతున్నది. ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేస్తుంది. అని మంత్రి వివరించారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest