మంచిర్యాలలో ఆసక్తికర పోటీ ?

 

మంచిర్యాల, 13 నవంబర్ 2023

తెలంగాణ ఎన్నికల్లో అనేక నియోజకవర్గాల్లో ఎంతో ఆసక్తికరమైన పోటీ నెలకొంది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో రాజకీయం మరింత ఆసక్తిగా కొనసాగుతోంది. చివరి నిమిషంలో ఈ జిల్లాలో వివేక్ అడుగుపెట్టడంతో ఇక్కడి రాజకీయం అంత హడావిడిగా మారింది. నిజానికి మంచిర్యాల జిల్లాలో మొత్తం మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు. ఈ మూడింటిలో బెల్లంపల్లి, చెన్నూరు ఎస్సిలకు రిజర్వ్ చేయబడ్డాయి. ఒకే ఒక్క మంచిర్యాల జనరల్ నియోజకవర్గంగా ఉంది. మంచిర్యాలలో బి ఆర్ ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే దివాకర్ రావు , కాంగ్రెస్ నుంచి ప్రేమ్ సాగర్ రావు బరిలో ఉన్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే 2018 ఎన్నికల్లో బెల్లంపల్లి నుంచి పోటీపడ్డ ఇద్దరు వ్యక్తులు తిరిగి 2023 లో కూడా పోటీ పడుతున్నారు. బెల్లంపల్లి బి ఆర్ ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కు ప్రత్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ బరిలో ఉన్నారు. 2018 ఎన్నికల్లో కూడా బెల్లంపల్లి నుంచి వీరిద్దరే పోటీపడినప్పటికీ, వినోద్ బి ఎస్ పీ నుంచి పోటీ చేసి దుర్గం చిన్నయ్య చేతిలో ఓటమిపాలయ్యారు. ఇప్పుడు తిరిగి ఇద్దరు పోటీ పడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్న వినోద్ ఎలాగైనా నెగ్గాలని సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 2018లో జరిగిన తప్పులను ఇపుడు జరుగకుండా చూసుకుని గెలుపుకోసం ప్రయత్నిస్తున్నానని వినోద్ అంటున్నారు.

మంచిర్యాల జిల్లాలో కూడా పాతకాపులే పోటీపడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే దివాకర్, కాంగ్రెస్ నుంచి ప్రేమ్ సాగర్ రావు బరిలో ఉన్నారు. 2018 ఎన్నికల్లో కూడా వీరిద్దరే పోటీపడ్డారు. అయితే ప్రేమ్ సాగర్ రావు ను దివాకర్ రావు ఓడించారు. ఇప్పడు మరోసారి వీరిద్దరూ పోటీపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ గెలవడానికి ప్రేమ్ సాగర్ రావు తెగ తంటాలు పడుతున్నాడు.

ఇక చెన్నూరు విషయమే కాస్త ఆసక్తికర రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ అత్యధికంగా ఓట్లు ఉన్న నేతకాని సమాజం నుంచి కాంగ్రెస్ పార్టీ గోమాస శ్రీనివాస్ బరిలో ఉన్నప్పటికీ చివరి నిమిషంలో వివేక్ కాంగ్రెస్ కండువా కప్పుకుని చెన్నూరు బరిలో నిలబడ్డారు. బి ఆర్ ఎస్ నుంచి బాల్క సుమన్ బరిలో ఉన్నారు. తెలంగాణ ఏర్పడిన 2014 ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా వివేక్ కాంగ్రెస్ నుంచి, బాల్క సుమన్ టి ఆర్ ఎస్ నుంచి బరిలో దిగారు. వివేక్ పైన బాల్క సుమన్ గెలిచారు. ఇప్పడు 2023 లో ఈ ఇద్దరు ఎమ్మెల్యేగా పోటీ పడుతున్నారు.

చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో నేతకాని సామజిక వర్గానికి చెందిన ఓట్లు చాలా కీలకం కానున్నాయి. ఒక్కో నియోజకవర్గంలో సుమారు యాభైవేలకు పైగా ఓట్లు ఉన్నాయి. దీంతో ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల నాయకులూ నేతకాని సామజిక ఓట్ల కోసం కసరత్తు చేస్తున్నారు. వివేక్, వినోద్ లతో పాటు మంచిర్యాలలో కూడా మెజారిటీ ఓట్లు నేతకానివాళ్ళావే కాబట్టి మంచిర్యాల జిల్లలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇంత ఆసక్తి కర రాజకీయాలు మరో జిల్లాలో కనిపించవు. కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు అభ్యర్థులపైనా పోటీ నెలకొంది. ఇప్పుడు నలుగురు బరిలో ఉన్నా చివరికి వచ్చేసరికి రెండు ప్రధాన పార్టీల మధ్యనే పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest