మిల్లెట్‌ మ్యాన్‌ పీవీ సతీశ్‌ ఇక లేరు

 

హైదరాబాద్‌ :

దక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ వ్యవస్థాపకులు, అందరూ ‘మిల్లెట్‌ మ్యాన్‌’గా పిలిచే పీవీ సతీశ్‌ (77) కన్నుమూశారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన గత 3 వారాలుగా హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. పాత పంటల పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణకు కృషిచేసి చిరుధాన్యాల సూరీడుగా సతీశ్‌ మంచి గుర్తింపు పొందారు. జహీరాబాద్‌ ప్రాంతంలో దాదాపు 40 ఏళ్లుగా పాత పంటల పరిరక్షణ కోసం పనిచేసి ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందారు. దళిత, పేద సామాజిక వర్గాల్లోని మహిళల్ని ఐక్యం చేసి చిరుధాన్యాల సంరక్షణ కోసం తన తుది శ్వాసవరకు కృషి చేశారు. జహీరాబాద్‌ ప్రాంతంలో మహిళా సంఘాలను ఏర్పాటు చేయడం, సాగులో వారే కీలక పాత్ర పోషించేలా చూడటం, చిరుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచడం, అడవుల పరిరక్షణ, సేంద్రీయ వ్యవసాయం, విద్యా నైపుణ్యాలను మెరుగుపర్చడం తదితర అంశాలపై అవిరళ కృషి చేశారు. పస్తాపూర్‌ కేంద్రంగా జహీరాబాద్‌ ప్రాంతంలోని 75 గ్రామాల్లో ఎందరికో ఆయన అండగా నిలిచారు. నిరక్షరాస్యులైన గ్రామీణ మహిళలు విదేశాలకు వెళ్లి ప్రముఖుల సమక్షంలో అనర్గళంగా మాట్లాడేలా వారిలో స్ఫూర్తి నింపిన ఘనత ఆయన సొంతం. పీవీ సతీష్‌ మరణ వార్త తెలియగానే ఆయా గ్రామాల్లోని మహిళలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పస్తాపూర్‌ తరలివచ్చి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆయన మృతి పట్ల వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, అధికారులు సంతాపాన్ని ప్రకటించారు. ప్రజల సందర్శనార్థం సతీశ్‌ భౌతిక కాయాన్ని జహీరాబాద్‌లోని పస్తాపూర్‌ డీడీఎస్‌ కార్యాలయానికి తరలించారు. ఆయన పార్థివదేహం చూసిన మహిళలు బోరున విలపించారు. సోమవారం ఉదయం డీడీఎస్‌ ప్రాంగణంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సొసైటీ ప్రతినిధులు తెలిపారు.

మైసూరులో పుట్టి..తెలంగాణలో సేవలందించి

1945 జూన్‌ 18న కర్ణాటకలోని మైసూరులో జన్మించిన పెరియపట్న వెంకటసుబ్బయ్య సతీశ్‌ (పీవీ సతీశ్‌) దిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌లో గ్రాడ్యుయేషన్‌ చేశారు. జర్నలిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించారు. దూరదర్శన్‌లో దాదాపు ఇరవయ్యేళ్ల పాటు పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణాభివృద్ధి, అక్షరాస్యతకు సంబంధించిన కార్యక్రమాల రూపకల్పనకు కృషి చేశారు. 1970లో చారిత్రక ఉపగ్రహ బోధన టెలివిజన్‌ ప్రయోగం లో కీలక పాత్ర పోషించారు. 1980లో డీడీఎస్‌ను స్థాపించి పేద, దళిత మహిళల సామాజికాభివృద్ధికి కృషి చేశారు. పౌష్టికాహార లోపం, భూసార పరిరక్షణ, జీవవైవిధ్యం, లింగవివక్ష రూపుమాపడం, సామాజిక సమానత్వంకోసం తన వంతు సేవలందించారు. ఆయన నాయకత్వంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డీడీఎస్‌ సంస్థకు గుర్తింపు దక్కింది. ఈ ప్రాంత మహిళలు దశాబ్దాలుగా చేసిన కృషికి 2019లో ‘ఈక్వేటర్‌’ అవార్డు దక్కింది. పీవీ సతీశ్ మృతి పట్ల వివిధ రాజకీయ పార్టీల నేతలు, అధికారులు సంతాపం తెలిపారు.

సతీశ్‌ మరణ వార్త షాక్‌కు గురిచేసింది : మంత్రి హరీశ్‌ రావు

దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ వ్యవస్థాపకులు పీవీ సతీశ్‌ మృతి పట్ల మంత్రి హరీశ్‌ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సతీశ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. జహీరాబాద్‌ ప్రాంతంలో 40 ఏళ్లుగా సామాజిక సేవ చేస్తూ మిల్లెట్స్‌, సేంద్రియ వ్యవసాయంలో రైతులకు, ముఖ్యంగా వెనుకబడిన మహిళలకు శిక్షణ ఇస్తూ మహిళా సాధికారత కోసం కృషిచేసిన గొప్ప మానవతా వాది అని హరీశ్‌రావు ట్విటర్‌లో కొనియాడారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest