ముప్పు తప్పించిన అత్యాధునిక టెక్నాలజీ

 

బీబీనగర్

బీబీనగర్-ఘట్‌కేసగర్ స్టేషన్ల మధ్య గోదావరి ఎక్స్‌ప్రెస్ (Godavari Express Train) రైలు పట్టాలు తప్పింది. ఎస్1 నుంచి ఎస్4, జనరల్, లగేజీ బోగీలు పట్టాలు తప్పాయి. పట్టాలు తప్పాక..కిలోమీటర్ వరకు బోగీలను ఈడ్చుకుంటూ ముందుకు వెళ్లాయి. కాంక్రీట్ స్లీపర్స్ ముక్కలు ముక్కలయ్యాయి. విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయాయి. ఇంత జరిగినా.. ఒక్క కోచ్ కూడా బోల్తాపడలేదు. పట్టాలు తప్పినప్పటికీ.. అలాగే నిలబడిపోయాయి. అలా జరగడం వల్లే.. పెను ముప్పు తప్పింది. గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో LHB (లింక్ హాఫ్‌మ‌న్ బుష్) కోచ్‌లు ఉండడం వల్లే.. ముప్పు తప్పింది.
ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు కాకుండా.. సాధారణ కోచ్‌లు ఉంటే.. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఒక కోచ్‌లోకి మరో కోచ్‌లు దూసుకెళ్తాయి. ఒకదానిపైకి మరొకటి ఎక్కుతుంటాయి. కానీ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఎక్కడివి అక్కడే ఉండిపోయాయి.

ఈ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు బరువు తక్కువగా ఉంటాయి. గ‌రిష్టంగా 140-160 కిమీ వేగంతో ప్ర‌యాణం చేసేలా వీటిని తీర్చిదిద్దారు. ఇందులో డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. లోకో పైలట్ బ్రేక్ అప్లై చేసినప్పుడు.. ఎక్కుడున్న బోగీ అక్కడే ఆగిపోతుంది. అంతేకాదు ఎప్పుడైనా పట్టాలు తప్పినప్పుడు… రైళ్ల చక్రాలు పట్టాల నుంచి బయటకు రావు. రెండు పట్టాల మధ్యే ఉండిపోతాయి. అలాంటి అధునాతన టెక్నాలజీ ఈ ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల సొంతం.

ప్రస్తుతం 50 శాతానికి పైగా రైళ్లలో ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. 2020 మార్చి నాటికే 10,000 ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను రూపొందించారు.

ఎల్ హెచ్ బీ కోచ్‌లు యాంటీ టెలిస్కోపిక్. అంటే, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఈ కోచ్‌లు వాటి ముందున్న కోచ్‌లపైకి ఎక్కే ఆస్కారం ఉండదు. అధిక వేగంలోనూ సమర్థమైన బ్రేకింగ్ కోసం ఎల్‌హెచ్‌బీ కోచ్‌లలో ‘అడ్వాన్స్‌డ్ న్యూమాటిక్ డిస్క్ బ్రేక్ సిస్టమ్’ను వినియోగిస్తున్నారు ప్రమాదం జరిగినప్పుడు ఆటోమేటిక్‌గా వేగం తగ్గి నిలిచిపోయేలా ఈ బోగీలను రూపొందించారు. రైళ్లు పరస్పరం ఢీకొన్నా, పట్టాలు తప్పినా.. బోగీలు ఒక దానిపైకి మరొకటి ఎక్కే ముప్పు ఉండదు.

ఎల్‌హెచ్‌బీ కోచ్‌లలో సెంటర్ బఫర్ కప్లింగ్ (CBC) వ్యవస్థ ఉపయోగిస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఒక కోచ్ మరొక కోచ్‌తో ఢీకొట్టుకోకుండా ఈ వ్యవస్థ నివారిస్తుంది.

ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు 1.7 మీటర్లు అధిక పొడవు ఉంటాయి. ‘కంట్రోల్డ్ డిశ్చార్జ్ టాయిలెట్ సిస్టమ్ (సీడీటీఎస్)’ ఉంటుంది. వీటిలో బయో-టాయిలెట్లు అమర్చి ఉంటాయి. ఇవి పర్యావరణ అనుకూలమైనవి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest