హైదరాబాద్:
తెలంగాణకు మకుటాయమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా దివంగత నిజాం ముకర్రం జా మాజీ భార్య ప్రిన్సెస్ ఎస్రా భారీ విరాళం ఇచ్చారు..5 లక్షలు విలువైన 67 గ్రాముల స్వర్ణాభరణలను (Gold Jewelry) ఆలయానికి బహూకరించారు. యువరాణి ఎస్రా తరఫున యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ జి.కృష్ణారావు ఈ స్వర్ణాభరణాలను ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్.గీతకు అందజేశారు.
లండన్‌లో ఉంటున్న యువరాణి ఎస్రా తరచూ హైదరాబాద్‌కు, తన స్వదేశమైన టర్కీకి వెళ్తుంటారని, యాదాద్రిని సందర్శించాలనే కోరికను కూడా గతంలో వెలిబుచ్చారని కృష్ణారావు తెలిపారు. ఇటీవల హైదరాబాద్ పర్యటనలో (Hyderabad) యాద్రాద్రి ఆలయాన్ని దర్శించాలని ఆమె అనుకున్నప్పటికీ గత నెలలో ముకర్రం జా మరణంతో ఆలయాన్ని సందర్శించలేకపోయారని వెల్లడించారు. అసఫ్ జాహీల పాలనలో హైదరాబాద్ చిట్టచివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కూడా యాదాద్రి ఆలయ అభివృద్ధికి గ్రాంట్‌గా రూ.82,825 మంజూరు చేసిన విషయం తెలిసిందే.