హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కమిటీని రద్దు చేసిన సుప్రీంకోర్టు

న్యూ ఢిల్లీ :

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కమిటీని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ప్రస్తుత కమిటీ స్థానంలో ఏక సభ్య కమిటీని నియమించింది సర్వోన్నత న్యాయస్థానం. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ లావు నాగేశ్వరరావుతో ఏకసభ్య కమిటీని రూపొందించింది. ఇకపై హెచ్‌సీఏ వ్యవహారాలు కొత్త కమిటీ చూసుకుంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. జస్టిస్‌ లావు నాగేశ్వరరావు కమిటీ నివేదిక ప్రకారం తదుపరి ఆదేశాలు ఉంటాయని వివరించింది. ఇక హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో విభేదాలు బయటపడుతున్న సంగతి తెలిసిందే.హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్‌పై పలు ఆరోపణలు వస్తోన్నాయి. ఉప్పల్ మ్యాచ్‌లో జరిగిన తప్పిదాలతో హెచ్‌సీఏ తలనొప్పులు మొదలయ్యాయి.

అజహరుద్దీన్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. మ్యాచ్‌ టికెట్లను పక్కదారి పట్టిస్తున్నారు. ఆన్‌లైన్‌ టికెట్లలో కూడా గోల్‌మాల్‌ చేశారని అప్పట్లో విమర్శలు వచ్చాయి.వర్గ పోరు, అధికార కాంక్షతో వివాదాలకు నిలయమైన హెచ్‌సీఏలో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అధ్యక్షుడిగా అజహరుద్దీన్‌ పదవీ కాలం సెప్టెంబర్‌ 26తోనే పూర్తయిందని, హెచ్‌సీఏకు ఎన్నికలు నిర్వహిస్తామని ప్రత్యేక ఏజీఎం నిర్వహించి హెచ్‌సీఏ పెద్దలు ప్రకటించారు. కానీ ఎన్నికలు జరగాలా వద్దా? అని నిర్ణయించాల్సింది ఎవరు? అసలు ఈ గందరగోళ పరిస్థితికి కారణం ఎవరు? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. హెచ్‌సీఏలో పాలన సవ్యంగా సాగడం కోసం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ నిసార్‌ అహ్మద్‌ కక్రూ ఛైర్మన్‌గా పర్యవేక్షక కమిటీ (ఎస్‌సీ)ని సుప్రీం కోర్టు నియమించిన సంగతి తెలిసిందే. అందులో ఐపీఎస్‌ అంజనీ కుమార్‌, మాజీ క్రికెటర్‌ వెంకటపతి రాజు, వంకా ప్రతాప్‌ ఇతర సభ్యులుగా ఉన్నారు. కానీ ఈ ఎస్‌సీ సభ్యుల్లోనే ఏకాభిప్రాయం లేదన్న విషయం ఇప్పటికే జస్టిస్‌ కక్రూ నివేదికతో స్పష్టమైంది. ఛైర్మన్‌గా ఉన్న తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రాష్ట్రంలో 33 జిల్లా సంఘాలకు హెచ్‌సీఏ సభ్యత్వాన్ని ఇచ్చేందుకు ఎస్‌సీ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. అంతే కాకుండా పదవీ కాలం ముగిసినందున అజహరుద్దీన్‌ అధ్యక్షతన హెచ్‌సీఏలో తీసుకున్న నిర్ణయాలను పక్కన పెడుతున్నట్లూ పేర్కొన్నారు. అయితే ఆ కమిటీని తాజాగా సుప్రీం కోర్టు రద్దు చేసింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ లావు నాగేశ్వరరావుతో ఏకసభ్య కమిటీని నియమించింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest