10వ తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించండి -స్టూడెంట్స్ పై ఒత్తిడి వద్దు

హైదరాబాద్
ఏప్రిల్ 3 వ తేది నుండి జరగనున్న పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి, ఆందోళనకు లోను కాకుండా సంసిద్ధం కావాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో బుధవారం నాడు పాఠశాల విద్యా సంచాలకుల కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షలపై విద్యార్థులకు ఉన్న సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసి, వారిలో మనోధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత ఆయా యాజమాన్యాలతో పాటు అధ్యాపకులకు, తల్లిదండ్రులకు ఉందన్నారు. లక్షలాది మంది విద్యార్థులు హాజరవుతున్న పదవ తరగతి పరీక్షలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 , 94 , 620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతుండగా 2 ,652 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణలో జిల్లా కలెక్టర్ల పాత్ర కీలకమని మంత్రి పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో ప్రస్తుతం ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున, పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక జాగ్రత్తలతో పాటు విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు, తాగునీరు, ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచాలని కోరారు. విద్యార్థులకు మంచి వాతావరణంలో పరీక్షలు రాసేందుకు సౌకర్యాలు కల్పించాలని అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, సజావుగా నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని కోరారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు వాటిని మానిటరింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పరీక్షల సమయంలో విద్యుత్ కి ఆటంకం కలగకుండా నిరంతరం ఉండేలా చూడాలని ఆదేశించారు. హాల్​టికెట్లను సంబంధిత పాఠశాలలకు ఇప్పటికే పంపటం జరగడంతోపాటు విద్యార్థులే స్వయంగా డౌన్​లోడ్ చేసుకునే అవకాశం కల్పించామని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుండి పరీక్షా పేపర్లను 11 నుంచి 6 కు కుదించడం జరిగిందని, సైన్స్ పరీక్షా రోజున భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం కు సంబంధించి ప్రశ్నా పత్రాలు మరియు జవాబు పత్రాలను విడివిడిగా అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా తాము చదివిన పాఠశాలలకు సమీపంలోనే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. రోజు వారి పరీక్షల నిర్వహణ చేయడం కోసం జిల్లా వారీగా ప్రత్యేకంగా పరిశీలకులను నియమిస్తున్నామన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి అర్ టీ సి బస్సుల్లో ఉచితప్రయాణం చేసే సౌకర్యం కల్పించినట్లు మంత్రి వెల్లడించారు. పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించడంతో పాటు ప్రత్యేక మెనూ అమలుచేశామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా శాఖ సంచాలకురాలు  దేవసేన తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest