హైదరాబాద్
బంజారాహిల్స్ లోని కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ రాజారెడ్డి రచించిన కాకతీయ కాయిన్స్ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు.
మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ఘన చరిత్ర కలిగిన కాకతీయ సామ్రాజ్య వాస్తవ పరిస్థితులు వివరించే ‘కాకతీయ కాయిన్స్’ పుస్తకాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉంది.
కాకతీయ హెరిటేజ్ ట్రస్టు నిర్వాహకులు పాపారావు గారి సూచనతో ప్రముఖ నాణేల అధ్యయన నిపుణులు డాక్టర్ రాజారెడ్డి.. గారు నాంపల్లి స్టేట్ మ్యూజియంలో ఉన్న 1,500 కాకతీయ నాణేలపై పరిశోధన జరిపారు.
ఎంతో శ్రమించి, నాణేలను పరిశీలించి, వాటిని కాకతీయ శాసనాలతో అనుసంధానించి ఓ కొలిక్కి తెచ్చారు. ఓ మహా సామ్రాజ్యానికి సంబంధించిన నాణేల వివరాలను ప్రజల ముంగిట ఉంచేందుకు, తన పరిశోధన వివరాలతో ఈ పుస్తకాన్ని రూపొందించారు.
అంతటి ప్రాముఖ్యత గల కాకతీయ కాయిన్స్ పుస్తకావష్కరణలో పాల్గొనడం గర్వంగా ఉంది.
నాణేల మీద పరిశోధనలు చేసే, రాజారెడ్డి గారు ప్రముఖ న్యూరో వైద్యులు కూడా. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో అమోఘమైన సేవలు అందించారు. ఎంతో మందిని న్యూరోసర్జన్లుగా తీర్చిదిద్దారు. నిమ్స్ డైరెక్టర్‌గా కూడా సేవలందించారు. ఒకవైపు డాక్టర్‌గా సేవలందిస్తూనే, మరో వైపు తెలంగాణ చరిత్రను ఆధారాలతో సహా నిర్మించే గొప్ప పనిలో నిమగ్నమై ఉన్నారు. రాజారెడ్డి కృషికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు.
ఘన వైభవం కలిగిన కాకతీయుల చరిత్రను కాపాడుకోవాలనీ, కాకతీయులు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి మరియు ప్రచారం చేయడానికి కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్‌ను జూలై 2009లో బి.వి.పాపా రావు (ఐ.ఎ.ఎస్. రిటైర్డ్) మరియు ప్రొఫెసర్ ఎం. పాండురంగారావు (పి.హెచ్.డి) స్థాపించారు.
ఇందులో భాగంగా కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ అధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులకు కాకతీయ హెరిటేజ్ గురించి అవగాహన పెంచేలా వర్క్‌షాపులు మరియు సెమినార్‌లను నిర్వహిస్తున్నారు.
కాకతీయ సంస్కృతి మరియు వారసత్వాన్ని ప్రోత్సహించడానికి ట్రస్టు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
డాక్టర్ రాజారెడ్డి నాణేల మీద పరిశోధన చేశారు, పుస్తకం రూపంలో తీసుకువచ్చారు.? అసలు నాణేల ద్వారా ఏం తెలుస్తుంది.? ఎందుకు ఇంత పరిశోధన అని కొందరికి అనుమానం ఉండొచ్చు.
ఒక రాజ్యం ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, మత పరిస్థితులకు నాణేలు, శాసనాలు అద్దం పడతాయి. నాటి పరిస్థితులకు సజీవ సాక్ష్యంగా నిలుస్తాయి. ఘనమైన చరిత్రకు నిజమైన ఆధారాలుగా నిలిచి చరిత్రను పునర్ లిఖించేందుకు దోహదం చేస్తాయి.కాకతీయులది అద్భుతమైన పాలన. కాకతీయుల కాలంలో ఆంధ్రదేశం సిరిసంపదలతో విలసిల్లినట్లు అమీర్‌ఖుస్రో, మార్కోపోలో లాంటి విదేశీ యాత్రికులు వారి రచనల ద్వారా ప్రపంచానికి తెలిపారు.రచనలు, నాణేలు, శాసనాలు మాత్రమే కాదు, కాకతీయుల పాలనకు ఇప్పటికీ అనేక సాక్ష్యాలు మన కళ్లముందు సాక్ష్యాలుగా ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో సాగుభూమిని, నీటి వనరులను పెంచడానికి కాకతీయులు ఆనాడే ఎనలేని కృషి చేశారు.
కాకతీయుల కాలంలో వ్యవసాయంపై వారి ప్రత్యేక దృష్టి కారణంగా ఏర్పడిన చెరువులు, సరస్సులు, గ్రామాలు, వ్యవసాయ క్షేత్రాలు తరతరాలుగా మనకు వారసత్వంగా ఉండిపోయాయి.పాకాల, లక్నవరం, రామప్ప, గణపవరం, పానగల్లు, ఉదయసముద్రం, శనిగరం, ఘనపూర్, ధర్మసాగర్, భీం ఘనపూర్, బయ్యారం, నాగారం, కాట సముద్రం, చౌడ సముద్రం, సబ్బి సముద్రం, గౌర సముద్రం, కోమటి చెరువు, ఎరకసాని ఎరక సముద్రం, చింతల సముద్రం, నామా సముద్రం ఇలా ఎన్నో ఉన్నాయి.
ఇదంతా ఎందుకు చేశారు? వ్యవసాయ విస్తరణకు, జల వనరులకు ఎందుకు అంత ప్రాధ్యానం ఇచ్చారు, సాగు విస్తీర్ణం ఎందుకు పెంచారు.. అంటే.? చెరువులను నిర్మించడం నాడు పుణ్యకార్యంగా భావించేవారు కాబట్టి.కాకతీయులు నిర్మించి, పరిరక్షించిన చెరువులు తదనానంతరం వచ్చిన రాజ్యాలు, ఆధునిక ప్రభుత్వాలు నిర్లక్ష్యం చయడంతో పతనావస్థకు చేరుకున్నాయి. శిథిలం అయిపోయాయి. దీంతో సాగునీరు, తాగునీరు సమస్యలు తలెత్తాయి. ఉన్న చెరువులను బాగు చేయకపోవడం, కొత్తగా ఏర్పాటు చేయకపోవడంతో నీటి గోస మొదలైంది.తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించిన వెంటనే, తెలంగాణ ప్రాంతంలో పూడుకుపోయిన వేలాది చెరువులను బాగుచేసి సాగునీటి పరిస్థితులు మెరుగుపరచాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.విజన్ ఆఫ్ కాకతీయాస్ అని పేర్కొంటూ, ఆ గొప్ప సామ్రాజ్యం పేరిటనే మిషన్ కాకతీయ అని పథకానికి నామకరణం చేశారు. 46వేలకు పైగా చెరువులకు ప్రాణం పోసి, కాకతీయ రాజ్య పాలకులకు ఘనంగా నివాళి అర్పించారు.
చెరువులు బాగు పడటంతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. ప్రాజెక్టులతో వీటిని అనుసంధానం చేయడంతో మండు వేసవిలో సైతం నిండు కుండళ్లా చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. భూగర్భ జల మట్టం పెరిగి, 20 లక్షల ఎకరాల ఆయకట్టు సిర్థీరకరణ పొందింది.
అదే స్ఫూర్తితో కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, దేవాదుల తదితర పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును ప్రభుత్వం అభివృద్ధి చేసింది.
3825 కోట్లతో 1200 చెక్ డ్యాంలు అభివృద్ధి చేసింది. బహుల దశల ఎత్తిపోతల కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు స్థాయిలో మూడన్నరేళ్లలో పూర్తి చేసి లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నది.
మొత్తంగా 73 లక్షల 33 వేల ఎకరాలకు సాగునీటి వసతి ఏర్పడింది. రానున్న రెండు మూడేళ్లల మరో 50లక్షల 24వేల ఎకరాలకు సాగు నీరు అందించే దిశగా అడుగులు వేస్తున్నది. మొత్తంగా కోటి 25 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే లక్ష్యాన్ని చేరుకునేందుకు ముందుకు సాగుతున్నది.
కాకతీయుల స్ఫూర్తితో సీఎం కేసీగార్ గారు సాగునీటి రంగంలో అమలు చేసిన విప్లవాత్మకమైన చర్యల వల్ల ఏమైంది? అంటే.. ఇవాళ దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ అవతరించింది.
2014-15 తెలంగాణలో మొత్తం పంట సాగు విస్తీర్ణం 131.33 లక్షల ఎకరాలు కాగా, తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్న వ్యవసాయ అభివృద్ధి చర్యల వల్ల సాగు విస్తీర్ణం 2020-21 నాటికి 215.37 లక్షల ఎకరాలకు చేరుకున్నది. రాష్ట్రంలో వరి ఉత్పత్తి మూడు రెట్లు పెరిగింది. 2014-15లో 68.17 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 2021-22లో 2 కోట్ల 2 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకొన్నది. దేశ వ్యవసాయ వృద్ధి రేటు 4 శాతం కాగా తెలంగాణ వ్యవసాయ వృద్ధి రేటు 7.4 శాతంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో వ్యవసాయ అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఘనతకు ఇది నిదర్శనం.
కాకతీయులు నాడు చెరువులు నిర్మిస్తే, అప్పటి చెరువులకు పూర్వవైభవం తెచ్చి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసింది కేసీఆర్.
చరిత్ర అంటే యుద్దాలు కావు, చరిత్ర అంటే ఆక్రమణలు కావు, చరిత్ర అంటే తేదీలు కావు. చరిత్రలో ఎన్నో రాజ్యాలు, ఎంతో మంది పాలకులు వచ్చారు వెళ్లారు. కానీ వారు చేసిన మంచి పనులే శాశ్వతంగా నిలుస్తాయి. వాటినే భవిష్యత్ తరాలు తలుచుకుంటాయి.
మంచి పనులు మాత్రమే చరిత్రలో మిగిలిపోతాయి. పార్టీలు, రాజకీయాలు మారుతూనే ఉంటాయి. కానీ చేసిన మంచి పనులను ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకుంటారు.
క్రీస్తు శకం 750 నుంచి 1350 వరకు పాలించిన కాకతీయులను మనం ఇప్పటికీ స్మరించుకుంటున్నాం అంటే వారు చేసిన మంచి పనులే కారణం.
తెలంగాణను పాలించిన శాతవాహనులు, కాకతీయులు సహా ఇతర రాజ్యాల పాలనలో మనం గర్వపడే విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఆధారాలతో సహా బయటికి తీయాల్సిన అవసరం ఎంతో ఉంది. మరింత పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. ఆధారాలతో వాస్తవ చరిత్రను లిఖించి భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉంది.
కాకతీయుల వారసత్వ సంపదను కాపాడుతున్నందుకు, రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు సాధించడంలో కృషికి చేసినందుకు మరొక్కసారి కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్‌కు కృతజ్ఞతలు చెబుతున్నాను.
ఈ గొప్ప కృషిని ఇలాగే కొనసాగించాలని, ప్రభుత్వం తరుపున, వ్యక్తిగతంగా అవసరమైన సహకారం ఉంటుందని హామీ ఇస్తున్నాను.