Revanth V/S Bhatti కాంగ్రెస్ నోటా దళిత సీఎం మాట -రెడ్డికి చెక్ పెట్టేందుకేనా?

హైదరాబాద్ :

తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న వర్గ విబేధాలు ఇప్పుడు అధిష్టానం దాకా వెళ్లాయి. ఒక పక్క రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున తరుణంలో మరో కాంగ్రెస్ సీనియర్ నేత సి ఎల్ పీ నాయకుడు భట్టి విక్రమార్క పాదయాత్ర చేపట్టడం హస్తం కార్యకర్తల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. నిజానికి రేవంత్ కు కార్యకర్తల్లో కూడా ఒక బలమైన వర్గం ఉంది కానీ రేవంత్ ను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ సీనియర్లలో ఎవరికీ బలమైన కార్యకర్తలు లేరు అని ఓ సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు. అయితే ఒక పక్క రేవంత్ రెడ్డి, మరో పక్క భట్టి యాత్ర మొదలు పెట్టిన నేపదాయంలో ఇప్పుడు కాంగ్రెస్ నోటా దళిత ముఖ్యమంత్రి మాట వినిపిస్తోంది. ఉదయ్ పూర్ లో జరిగిన ప్లీనరీ సమావేశంలో కూడా ఈ ప్రతిపాదన అధిష్టానం ముందు పెట్టినట్టు గాంధీ భవన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు కొత్త చ‌ర్చ మొద‌ల‌య్యింది. ద‌ళిత సీఎం అనే చ‌ర్చ‌ను ప‌లువురు నేత‌లు తెరమీదకు తెచ్చారు. ఏకంగా ఏఐసీసీ స్థాయికి ఆ చ‌ర్చ‌ను తీసుకెల్లారు. తెలంగాణ ముఖ్యమంత్రి పేరుతో కేసీఆర్ మోసం చేశారు కాబట్టి ఈ మంత్రాన్ని అమలు చేస్తే ద‌ళిత సీఎం ప్ర‌తిపాద‌న వ‌ర్క్ అవుట్ అవుతుంద‌ని తెలంగాణ నేతలు కొందరు భావిస్తున్నారు. అయితే ద‌ళిత సీఎం అనే ప్ర‌తిపాద‌న పార్టీ విజ‌యం కోసామా? లేక కేవలం రాజ‌కీయ కార‌ణాలున్నాయా? అన్న అంశాల‌ను హ‌స్తం పెద్ద‌లు ప‌రిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ మోసం ద‌ళిత సీఎం నినాదంతో 2014 లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సీఎం అయ్యారు. తిరిగి 2018 లో మ‌రో సారి కేసీఆర్ సీఎం అయినా ద‌ళిత సీఎం అనే అంశం చ‌ర్చ‌లో ఉంది. ద‌ళిత సీఎం అన్న హ‌మీని కేసీఆర్ విస్మ‌రించార‌ని, దళితులను కేసీఆర్ మోసం చేశారని కాంగ్రెస్ పదే ప‌దే గుర్తు చేస్తోంది. అయితే ద‌ళిత సీఎం అన్న హ‌మీని మ‌రిపించేందుకా అన్న‌ట్లు సీఎం కేసీఆర్ ద‌ళిత సంక్షేమం కోసం ప‌లు ప‌థ‌కాలు ప్రారంభించారు. ద‌ళితుకు మూడెక‌రాలు కొద్దీ రోజులు ఇచ్చి బంద్ పెట్టారు. ద‌ళిత బంధు, స‌చివాలాయానికి డా. బీ ఆర్ అంబేద్క‌ర్ పేరు పెట్టారు. అయినా ద‌ళిత సీఎం హ‌మీని ప్ర‌జ‌ల‌కు కాంగ్రెస్ గుర్తు చేస్తూనే ఉంది. రాజ‌కీయంగా టీఆర్ఎస్ స‌ర్కార్ ను ఇరకాటంలో పెట్టేందుకు ఈ అంశాన్ని ప్ర‌స్తావిస్తూనే ఉంది.అయితే ఇప్పుడు మరో అడుగు ముందుకేసిన ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు..ద‌ళిత సీఎం హ‌మీని గట్టిగానే ఎత్తుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే ద‌ళిత వ్య‌క్తిని సీఎం చేస్తామ‌న్న హ‌మీ ఇవ్వాల‌న్న ప్ర‌తిపాద‌న‌ల‌ను డిల్లి హ‌స్తం పెద్ద‌ల మందు ఉంచారు. తెలంగాణ‌లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే 90 శాతం మంది ఉంటార‌ని, అందుకే ద‌ళిత సీఎం అని ప్ర‌క‌టిస్తే కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డం సులభమవుతుందని అధిష్టానాన్ని ఒప్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నట్టు సమాచారం.

సీఎల్పీ నేత మ‌ల్లు బ‌ట్టివిక్ర‌మార్క‌, మాజీ డిప్యూటీ సీఎం దామోద‌ర రాజ‌న‌ర్సింహ వంటి నేత‌లు..ద‌ళిత సీఎం అన్న అంశాన్ని పార్టీ పెద్ద‌ల ప‌రిశీల‌న‌కు పెట్టిన‌ట్లు తెలుస్తోంది. రాయ్ పూర్ లో జ‌రిగిన కాంగ్రెస్ ప్లీనరీలో ఏఐసీసీ అధ్య‌క్షుడు ఖార్గేతో పాటు పార్టీ ముఖ్యులముందుంచిన‌ట్లు స‌మాచారం. ద‌ళిత సామజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడి పేరును సీఎం అభ్య‌ర్ధిగా ప్ర‌క‌టించాల‌ని కోరార‌ట‌. అయితే ముందే ముఖ్య‌మంత్రిని కాంగ్రెస్ ఏ రాష్ట్రంలోనూ ప్ర‌క‌టించ‌డం లేదు. ఎవ‌రినో ఒక‌రిని సీఎం అభ్య‌ర్దిగా ప్రకటిస్తే గ్రూపు త‌గ‌దాల‌తో అస‌లుకు మోసం వ‌చ్చే ప్ర‌మాదం ఉండ‌టంతో ఎన్నిక‌ల త‌ర్వాతే సీఎం ను ఎంపిక చేస్తున్నారు. అందుకే ఇప్ప‌టి వ‌ర‌కు ద‌ళిత సీఎం ప్ర‌తిపాద‌న‌ల అంశాన్ని ప‌క్క‌న పెట్టేసారట‌. ద‌ళిత సీఎం ప్ర‌తిపాద‌న వెన‌క కార‌ణాల‌ను కాంగ్రెస్ అధిష్టాన పెద్ద‌లు తెలుసుకునే ప‌నిలో పడ్డారు. నిజంగా పార్టీ విజ‌యం కోస‌మే ప‌లువురు నేత‌లు ద‌ళిత సీఎం అంశాన్ని తెర‌మీద‌కు తెస్తున్నారా? లేక ఇంకా ఏమైనా కార‌ణాలున్నాయ‌న్న అన్న నివేదిక‌లు తెప్పించుకుంటున్నార‌ట‌. టీపీసీసీ చీఫ్ రేవంత్ దూకుడు పెరిగాకా..ఇటు వంటి ప్ర‌తిపాద‌న‌లు రావడం వెనుక అంత‌ర్య‌మేంట‌నే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. రేవంత్ ను క‌ట్ట‌డి చేసేందుకు ఎన్నో ర‌కాలుగా ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. ఆయ‌న యాత్రకు అనుమ‌తులు రాకుండా ప్ర‌య‌త్నించారు. రేవంత్ యాత్ర జోరు మీదుండ‌గా..ఇత‌ర సీనియ‌ర్లు యాత్ర‌లు మొద‌లు పెట్టారు. రేవంత్ టార్గెట్ గా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు రేవంత్ అవ‌కాశాల‌ను దెబ్బ‌కొట్టేందుకు ద‌ళిత సీఎం అన్న ప్ర‌తిపాద‌న‌ల‌ను తెర‌మీద‌కు తెస్తున్నార‌నే అభిప్రాయాలున్నాయి. అయితే అస‌లు విష‌యం ఏలాగున్నా సీఎం అభ్య‌ర్ధిని ఎన్నిక‌ల ముందే ప్ర‌కటించే అవ‌కాశాలు లేనందున‌ ద‌ళిత సీఎం
అన్న అంశం అప్ర‌స్తుత‌మంటున్నారు  కాంగ్రెస్ నేత‌లు.

 

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest